‘నీవు లేక నేను లేను: భార్య మృతి తట్టుకోలేక భర్త బలవన్మరణం
భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వివాహం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన మానస్ కుమార్ దాస్(29).. హైదరాబాద్‌కు చెందిన ఆదర్శను 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అత్తాపూర్‌లో నివాసం ఉండేవారు.

ఆదర్శ మృతితో కుంగిపోయిన మానస్
కాగా, మార్చి 2, 2017న రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదర్శ మృతి చెందింది. అప్పటి నుంచి మానస్ తీవ్రంగా కుంగిపోయాడు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌కు మారాడు.

ఒంటరి జీవితం భరించలేక..
ఒంటరిగా ఉండే అతడి గది నుంచి బుధవారం నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడి గది తలుపులు తెరిచి చూడగా మానస్.. తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.. జార్ఖండ్‌లో నివసించే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఆదర్శ లేని జీవితం...
కాగా, మానస్ గదిలో అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తన కుటుంబసభ్యులను విచారణ పేరుతో పోలీసులు ఇబ్బంది పెట్టవద్దని మానస్ కోరాడు. తన భార్య లేకుండా ఉండలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌లో మానస్ పేర్కొన్నాడు. పోస్టుమార్టం అనంతరం మానస్ మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications