తాగొచ్చి వేధింపులు:తండ్రిని చంపి బావిలో పడేసిన కొడుకు
హైదరాబాద్: శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నెల రోజుల క్రితం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రినే ఓ కొడుకు హత్యచేసి, బావిలో పడేశాడు.
ఘటనకు సంబంధించి సీఐ ఉమామహేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ పాయిమ్(55) కుటుంబం ఏడాది కిత్రం బతుకుదెరువు కోసం శంషాబాద్ మండలంలోని గండిగూడ గ్రామంలోని నందంగౌడ్ ఫాహౌజ్‌కు వచ్చి నివసిస్తోంది.
అయితే, పాయిమ్ నిత్యం విపరీతంగా మద్యం సేవించి భార్య, ఇద్దరు కొడుకులను తీవ్రంగా వేధించే వాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు పాయిమ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 9న రాత్రి పెద్ద కొడుకు హైమద్ తండ్రి గొంతుకు చున్నీ బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు.
అనంతరం సమీపంలో ఉన్న మొగల్ గార్డెన్‌లోని బావిలో పడేశారు. వీరి వ్యవహారంపై ఫాంహౌజ్ యజమానికి అనుమానం రావడంతో గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సర్పంచ్ దేవికాగౌడ్ ఆ కుటుంబం వద్దకు వెళ్లి ప్రశ్నించగా పాయిమ్‌ను తామే చంపేసి, బావిలో వేసినట్లు ఒప్పుకున్నారు.
సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని, బావిలో నుంచి శవాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. అనంతరం పోలీసులు హైమద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దూషించాడని స్నేహితుడి హత్య
తన కుటుంబాన్ని దూషించాడని ఓ వ్యక్తి మద్యం మత్తులో స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్‌కు చెందిన శ్యామూల్(39) తన తల్లితో కలిసి మల్కాజిగిరి సర్కిల్ పీవీఎన్ కాలనీ కౌసిక్ అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో అతడికి 25 ఏళ్లుగా స్నేహం ఉంది. సోమవారం రాత్రి శ్యామూల్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చంద్రశేఖర్, అతడి స్నేహితుడు ప్రభాకర్ ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం ప్రభాకర్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ కుటుంబసభ్యులను శ్యామూల్ దూషించడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
చంద్రశేఖర్ ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కత్తిపీట తీసుకొచ్చి శ్యామూల్ గొంతు కోసి, కారంపొడి చల్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం స్నేహితుడు ప్రభాకర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రభాకర్ పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా శ్యామూల్ మృతిచెంది ఉన్నాడు.
ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కాగా, శ్యామూల్ తాగుడుకు బానిస కావడంతో అతడి భార్య 2002లో ఆత్మహత్య చేసుకుందని, అలాగే చంద్రశేఖర్ భార్య గతంలోనే అతడిని వదిలేసి బిడ్డతోసహా వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications