దారుణం: ‘అరేయ్’ అన్నాడని స్నేహితుడిని కొట్టి చంపాడు
ఆదిలాబాద్: జిల్లాలోని మంచిర్యాలలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అరేయ్ అన్నందుకు ఓ స్నేహితుడిని బండరాయితో కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల ఆరో వార్డు దొరగారిపల్లికి చెందిన కుమ్మరి పోశం (34), కొడిపె లక్ష్మణ్ స్నేహితులు.
శనివారం రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగారు. మాటల సందర్భంలో పోశం స్నేహితుడు లక్ష్మణ్‌ను అరేయ్ అని పిలిచాడు. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణ్.. అరేయ్ అంటవా అంటూ ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న బండరాయితో పోశం తల, ఛాతిపై బలంగా బాదాడు.
దీంతో పోశం అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, మృతుడి తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా, పోశం కూలి పనులు చేసుకుంటూ తల్లిని పోషించుకుంటున్నాడు.

సమాచారం అందుకున్న మంచిర్యాల పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా ఐజ మండలం పర్దిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications