నా భర్తను చంపెయ్ పెళ్లి చేసుకుంటా: ప్రియుడితో భార్య, చంపేశారు
మహబూబ్‌నగర్: ఆమె తన మొదటి భర్తకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా సక్రమంగా కాపురం చేసుకోకపోగా, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగకుండా తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామానికి చెందిన కురువ హనుమంతు(35), పక్క గ్రామమైన నందిపేటకు చెందిన సాయమ్మ(23) అలియాస్ బుజ్జిలకు గతంలోనే పెళ్లిళ్లు అయ్యాయి. హనుమంతు భార్యను, సాయమ్మ భర్తను వదిలేశారు. విడాకులు తీసుకుని, నాలుగేళ్ల క్రితం వీరిద్దరు రెండో పెళ్లి చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటూ, భవన నిర్మాణ పనులకు అడ్డకూలీలుగా వెళ్తున్నారు. హనుమంతు గొర్లకాపరిగా కూడా వెళ్లేవాడు. కాగా, అడ్డకూలీగా పనిచేసే చోట, డ్రైవర్‌గా పనిచేస్తున్న, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లంపల్లి గ్రామానికి చెందిన బాలుతో సాయమ్మకు పరిచయం ఏర్పడింది. ఇది వారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా, బాలుకు వివాహం కాలేదు.
సాయమ్మను పెళ్లి చేసుకుంటానని అడుగగా, భర్త ఉండగా ఎలా చేసుకుంటానని ప్రశ్నించింది. దీంతో 'అతడిని చంపేస్తా, చేసుకుంటావా' అని బాలు అడిగాడు. దానికి సాయమ్మ సరేనంది. ఈ నేపథ్యంలో బాలు 'నాది కూడా మహబూబ్‌నగర్ జిల్లాయే' అని హనుమంతును పరిచయం చేసుకుని, స్నేహంగా ఉండటం మొదలుపెట్టాడు.
మే 6వ తేదీన హత్య
ఈ క్రమంలో హనుమంతు గొర్రెలను మేపేందుకు గుంటూరు జిల్లాకు జీతానికి ఏప్రిల్‌లో వెళ్లాడు. బాలు మే 4వ తేదీన హనుమంతకు ఫోన్ చేశాడు. హనుమంతు గుంటూరులో ఉన్నానని, హైదరాబాద్‌కు వస్తున్నానని చెప్పాడు. దీంతో బాలు కనకదుర్గమ్మను దర్శనం చేసుకుందామని విజయవాడకు రమ్మని చెప్పాడు. బాలు అప్పటికే, తనకు స్నేహితుడైన, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లంపల్లికే చెందిన రాజుతో విషయం చెప్పాడు.
హనుమంతు హత్యకు కుట్ర పన్ని.. వీరిద్దరు కలిసి, 5వ తేదీన విజయవాడకు వెళ్లారు. అక్కడే బస చేశారు. 6న ఉదయం కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని, హైదరాబాద్‌కు బయలు దేరారు. సాయంత్రం 6గంటల కల్లా, చౌటుప్పల్‌కు చేరుకున్నారు. ఓ మద్యం దుకాణంలో మద్యం బాటిల్ కొని, హోటల్‌లో భోజనం పార్సిల్ తీసుకున్నారు. లక్కారం శివారులోని అటవీ భూమిలోకి వెళ్లారు.

ముగ్గురు కలిసి, మద్యం సేవించారు. హనుమంతు మత్తులోకి జారుకున్నాక, తలపై బండరాయితో మోదీ దారుణంగా చంపారు. ప్రాణం పోయిందో లేదోనని, గొంతుకు టవల్‌ను బిగించి, ఉరి వేశారు. సెల్‌ఫోన్‌లో హనుమంతు చనిపోయిన ఫొటోను తీసుకొని వెళ్లిపోయారు. అనుక్షణం ప్రతి విషయాన్ని ఫోన్‌లో సాయమ్మకు తెలిపారు.
కాగా, ఏమీ ఎరుగనట్లుగా సాయమ్మ పోలీస్ కేసు పెట్టడంతో... బాలు, రాజులు ఇద్దరు కలిసి, సాయమ్మ వద్దకు హైదరాబాద్‌కు వెళ్లారు. హనుమంతును చంపేసినట్టు సెల్‌ఫోన్‌లో ఫొటో చూపించారు. అక్కడి నుంచి ముగ్గురు మహబూబ్‌నగర్‌లోని బాలు అక్క ఇంటికి వెళ్లారు. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చారు. హనుమంతు కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా, సాయమ్మ మే 20న మహబూబ్‌నగర్‌కు వెళ్లింది.
హనుమంతు తల్లిదండ్రులు ఈదన్న, సుక్కమ్మలను కలిసి భర్త కనిపించడం లేదని చెప్పింది. ఆ తర్వాత సాయమ్మ మళ్లీ యథావిథిగా మే 26న మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. దీంతో పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు వివరాలను పంపారు. కాగా, మే నెలలోనే లక్కారం వద్ద గుర్తుతెలియని శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం అనంతరం పూడ్చివేయించారు.
మృతదేహం ఫొటోలను అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. వివరాలు సరిపోతుండడంతో, చౌటుప్పల్ సీఐ నవీన్‌కుమార్.. హనుమంతు తల్లిదండ్రులను పిలిపించారు. దీంతో మంగళవారం తల్లిదండ్రులు, భార్య ఇక్కడికి వచ్చారు. భార్య సాయమ్మపై అనుమానం రావడంతో.. పోలీసులు తమదైన శైలిలో ఆమెను విచారించారు. దీంతో జరిగిన విషయం చెప్పింది సాయమ్మ.
సాయమ్మ ప్రోద్బలంతోనే హత్య జరిగిందని, హత్య విషయం తెలిసినప్పటికీ, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు, ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెను రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి నల్గొండ జైలుకు తరలించారు. హనుమంతును హత్య చేసిన బాలు, రాజులు ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications