10రోజుల పరిచయానికే ప్రేమా?: యువతి నిరాకరణతో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: నేటి యువత ప్రేమకు ఆకర్షణకు తేడా తెలుసుకోలేకపోతోంది. తమ ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో వారిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది.
తాజాగా, పదిరోజుల సమయంలోనే ఓ విద్యార్థినిపై పెంచుకున్న ప్రేమ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. పరీక్షలు రాస్తున్నప్పుడు పరిచయమైన ఆ విద్యార్థిని తన ప్రేమను అంగీకరించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు తాను చదువుకుంటున్న కళాశాల వసతి గృహంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు, కళాశాల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతానికి చెందిన ఎంఎస్ మారప్ప శంషాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు ఎంఎస్ అరుణ్(18) కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామపరిధిలోని శ్రీచైతన్య బాయ్స్ క్యాంపస్‌లో ఇటీవల ఇంటర్మీడియట్ (ఎంపీసీ)ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి అక్కడే ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు.

కాగా, మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో తనతో పాటు పరీక్ష రాసిన ఓ విద్యార్థినితో అరుణ్‌కు పరిచయం ఏర్పడింది. సదరు విద్యార్థిని అరుణ్‌తో చనువుగా మాట్లాడటంతో దాన్ని ప్రేమగా భావించాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఆ విద్యార్థినికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అయితే, విద్యార్ధిని అందుకు నిరాకరించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ్ గురువారం అర్ధరాత్రి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలపడంతో వారు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి మారప్ప ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications