తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే శవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.
కాగా, రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉపఎన్నికలకు త్వరలో జరగనున్నాయి. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్వాబనంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్ తన, వివేక్ ఠాకూర్, ఉదయన్ రాజే, బిప్లబ్ కుమార్ దేబ్ బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికయ్యారు.

వీరితోపాటు ఆర్జేడీ నుంచి మీసా భారతి, కాంగ్రెస్ నుంచి దీపేంద్ర సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కే కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ స్థానానికి ఎన్నికయ్యేవారు ఏప్రిల్ 9, 2026 వరకు కొనసాగనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications