సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. జనవరి 13వ తేది నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని సీఎం ఏసీబీ కోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు.. రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
గతంలో ఓటుకు నోటు కేసు బెయిల్ సందర్భంగా పాస్‌పోర్టును సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు అప్పగించారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్టును 6 నెలలు ఇవ్వాలనే సీఎం అభ్యర్థనకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. మళ్లీ 2025 జులై 6వ తేది లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని రేవంత్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

సీఎం విదేశీ పర్యటనలో స్వల్ప మార్పు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. సీఎం ఆస్ట్రేలియా పర్యటన పూర్తిగా రద్దయ్యింది. జనవరి 14న సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో ఢి ల్లీలో పర్యటించనున్నారు. 15వ తేదిన దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆ తర్వాత 17వ తేదీన సీఎం ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తారు. అక్కడ్నుంచి నుంచి 19వ తేదీన దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. జనవరి 24వ తేది వరకు సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications