ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మాట్లాడింది చంద్రబాబే?: కేంద్ర నిఘా వర్గాలు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కేసు కీలక దశకు చేరుకుంది. చంద్రబాబు వాయిస్ రికార్డుల పైన ఫోరెన్సిక్ లేబోరేటరీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై నివేదికను ఇవాళో రేపో సమర్పించనుంది.
ఆడియో టేపులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని కేంద్రానికి ఐబీ తెలిపినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా, ఈ ఆడియో టేపు సేకరణ కోసం తెలంగాణ సర్కారు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని నివేదికలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆడియో టేపులోని సంభాషణల ఫోన్ కాల్స్‌కు సంబంధించి సెల్ ఫోన్ టవర్ లొకేషన్లను ఐబీ సాక్ష్యాలుగా చూపించిందని తెలుస్తోంది.
ఫోన్ సంభాషణలకు సంబంధించిన సెల్ ఫోన్ టవర్ లొకేషన్లలో ఒకటి స్టీఫెన్ సన్ ఇంటి సమీపంలో ఉండగా, మరొక లొకేషన్ చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటి వీధిలో ఉందని పేర్కొందని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ గొంతు నిజంగానే చంద్రబాబుది అయితే నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతుందని అంటున్నారు.

స్టీఫెన్ వాంగ్మూలం నమోదు
ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు ఇవాళో రేపో స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. అలాగే, నిధులు సమకూర్చిన కంపెనీల్లో తనిఖీలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు, రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ ఏసీబీ అధికారులు నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో రేవంత్, సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల వాయిస్ రికార్డులను నిర్ధారించుకునేందుకు వారి ఫోన్లు, ఆడియోటేపులను ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications