కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కి ఏసీబీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని షేక్‌పేట ఆదిత్య టవర్స్‌లోని ఆయన నివాసంలో.. తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ మెరుపు సోదాలు చేపట్టినట్టు సమాచారం. హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల రెయిడ్స్ కొనసాగుతోన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఏసీబీ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ప్రస్తుతం హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్నారు. గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు.

మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్‌ను విచారించింది. ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించగా, కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.
అంతే కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. ఇక హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications