పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఘోరప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలు పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి పడిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీలు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేస్తూ మృతి చెందడంతో అక్కడి తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగుమనగడ్డ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్ లో పనులు జరుగుతున్నాయి. గురువారాన్ నాడు అక్కడ పనులు జరుగుతున్న చోట ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్రేన్ వైర్ తెగిపోవటంతో పంపు హౌస్ లో పడి మృతి చెందిన ఐదుగురు కూలీలు బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాద ఘటన పై స్థానిక ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు . క్రేన్ వైరు తెగి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే గతంలోనూ పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ వద్ద ప్రమాద సంఘటన చోటుచేసుకుంది . ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఉయ్యాలవాడ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్న కంపెనీలో అతడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి తలపై సొరంగం కప్పు కూలి రాళ్లు పడడంతో అతను మృతి చెందాడు.












Click it and Unblock the Notifications