షాక్: కూకట్‌పల్లి ఎసిపి అక్రమాస్తుల విలువ రూ.300 కోట్లు
హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్‌పల్లి ఎసిపి సంజీవరావు అక్రమాస్తుల విలువ రూ. 300 కోట్ల మేరకు ఉంటుందని అంచనా చేశారు. 28 ఏళ్ల క్రితం ఎస్సైగా ఉద్యోగజీవితం ప్రారంభించిన ఆయన ఏసీపీ స్థాయికి ఎదిగే క్రమంలో ఆస్తుల విలువ కూడా పెరిగిపోయింది.
మొత్తం 200 ఎకరాల భూములను సంజీవ రావు సంపాదించినట్లు తేలింది. ఏసీబీ అధికారులు తవ్వినకొద్దీ అతని అక్రమాస్తులు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఎస్సైగా ఉద్యోగంలో చేరిన సంజీవరావు శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స విభాగాలతో పాటు ఏసీబీలోనూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో ఈ నెల 14న ఏసీబీ అధికారులు ఏసీపీ సంజీవరావు ఇళ్లపై దాడులు నిర్వహించి, అదేరోజు అరెస్టు చేశారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన అధికారులు సంజీవరావు అక్రమాస్తుల జాబితా చూసి గుడ్లు తేలేశారు. సంజీవరావు, అతడి బినామీల పేరిట మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా భూములున్నాయి. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఖరీదైన ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.
హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వేర్వేరుగా 18 బ్యాంకు ఖాతాలు, 10కు పైగా బ్యాంకు లాకర్‌లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతడు అక్రమంగా కూడబెట్టిన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.300 కోట్ల పై చిలుకే ఉంటుందని అనధికారిక అంచనా.
తిరుమలగిరి యాక్సిస్ బ్యాంకులోని లాకర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు తెరిచారు. అందులో సుమారు రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మిగిలిన బ్యాంకు లాకర్‌లనూ తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications