విడుదలైన వెంటనే అల్లు అర్జున్ కలిసింది ఆయననే: 45 నిమిషాల పాటు భేటీ: బిగ్ ట్విస్ట్
Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.
అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. లీగల్‌గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ విడుదలవుతున్నారనే వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద గుమికూడారు. ఆ సమయంలో ఆయనను ప్రధాన గేటు నుంచి తీసుకెళ్లడం సరికాదని భావించిన పోలీసులు జైలు వెనుక ద్వారం నుంచి విడుదల చేశారు. అప్పటికే అక్కడ ఉన్న కారులో ఎక్కి బయలుదేరారు.
చంచల్ గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇంటికి కూడా వెళ్లలేదు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అప్పటికే తన కోసం ఎదురు చూస్తోన్న సీనియర్ అడ్వొకేట్లు నిరంజన్ రెడ్డి, జీ అశోక్ రెడ్డి, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
అందరికంటే ముందు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే గడిపారు అల్లు అర్జున్. నిరంజన్ రెడ్డి, జీ అశోక్ రెడ్డి, వారి టీమ్, కొందరు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడారు. ఇది నాలుగు వారాల మధ్యంతరం కావడం వల్ల రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాలని విజ్ఙప్తి చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ.. రాత్రంతా జైలులోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే విషయంపైనా అల్లు అర్జున్ ఆరా తీశారని అంటున్నారు. దీనికి గల కారణాలను సమగ్రంగా వివరించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలా? వద్దా? అనే విషయంపై చర్చించారని సమాచారం.












Click it and Unblock the Notifications