తెలంగాణలో ఆట మొదలైంది- బీజేపీ అగ్ర నేతల మకాం : కమలం వర్సస్ గులాబీ..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జోష్ మీద ఉన్న బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పైన కన్నేసింది. అయిదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో గెలిచింది. ఆ వెంటనే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న సొంత రాష్ట్రం గుజరాత్ తొలి ప్రయార్టీగా భావిస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన మరుసటి రోజునే ప్రధాని మోదీ గుజరాత్ లో రెండు రోజుల పాటు రోడ్ షో లు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే హోం మంత్రి అమిత్ షా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం పర్యటించారు. ఇక, కమలం నేతల టార్గెట్ లిస్టులో ఇప్పుడు తెలంగాణ చేరింది.

కేసీఆర్ ముందస్తు వ్యూహాలు
తాజాగా, టీఆర్ఎస్ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో తమ పార్టీకి...ప్రభుత్వానికి మరోసారి ప్రజలు పట్టం కట్టేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో..తెలంగాణలో అసలు బీజేపీ రాజకీయంగా ఎదగడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుబ్బాక .. గ్రేటర్ హైదరాబాద్.. హుజూరాబాద్ ఫలితాలతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. దీని ద్వారా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

బీజేపీ టార్గెట్ టీఆర్ఎస్
ఈ ఏడాది చివర్లో గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటుగానే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కమలనాధులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసిన తెలంగాణ నేతలతోనూ అమిత్ షా ఇదే విషయం చెప్పారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. ఈనెల చివరివారంలో బీజేపీ నేత జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు రానున్నారు. నెలాఖరులో జనగాంలో బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఆ సభకు పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతో పాటుగా యూపీ సీఎం యోగీని ఆహ్వానించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకు పిలిచినా వస్తానంటూ గతంలోనూ తెలంగాణ నేతలకు యోగీ హామీ ఇచ్చారని కమలం నేతలు గుర్తు చేస్తున్నారు.

కీలక నేతల రాష్ట్ర పర్యటనతో
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు. దీని ప్రారంభ సమావేశానికి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అమిత్ షా రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. దీంతో..కమలం వర్సెస్ గులాబీ అన్నట్లుగా మారుతున్న రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కొత్త వ్యూహాలను తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది. దీనిని మరి గులాబీ బాస్ ఎలా తిప్పి కొడతారో చూడాలి. ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న పొలిటికల్ గేమ్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందనేది మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది. దీంతో..రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంి.












Click it and Unblock the Notifications