తెలంగాణకు కేంద్రం మెగా గుడ్ న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. రోడ్ల నిర్మాణం, వాటి మరమ్మతులు, కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకుని రావడం, మారుమూల ప్రాంతాలకూ ఈ సౌకర్యాన్ని కల్పించే దిశగా ముందడుగు వేసింది. దీనికోసం వేల కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
తెలంగాణ రోడ్డు మౌలిక సదుపాయాలను సమగ్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 60,799 కోట్ల భారీ ప్రణాళికను ఆమోదించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఈ బృహత్తర కార్యక్రమం తెలంగాణను బహుళజాతి సంస్థలకు కేంద్రంగా మారుస్తుందని, లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

- ఈ ప్రణాళికలోని ప్రధానాంశాలలో ఒకటి.. హైదరాబాద్-విజయవాడ రహదారిని ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించడం. ఈ ప్రాజెక్టుకు రూ. 10,400 కోట్లు కేటాయించారు. ఇది ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీని కల్పిస్తుంది.
- మరో కీలకమైన ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్). దీనిని రూ. 36,000 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది తెలంగాణ రవాణా, ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన మలుపు కానుంది.
- ఇది కాకుండా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) ప్రాజెక్టుకు రూ. 11,399 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించిన టెండర్లను త్వరలో ఆహ్వానించనున్నారు.
- అలాగే- కనెక్టివిటీ లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. జిల్లా అంతటా సమాన అభివృద్ధిని నిర్ధారించడానికి సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ హైవేలుగా కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
- ఈ కార్యక్రమం కింద చేపడుతున్న ముఖ్యమైన మార్గాల్లో మన్ననూర్ నుండి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర రూ. 8,000 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ఒకటి. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం గుండా వెళ్లే ఈ మార్గం పర్యాటకాన్ని, ప్రవేశ సాధ్యతను మెరుగుపరుస్తుంది.
- హైదరాబాద్‌లోని 'ఫ్యూచర్ సిటీ' నుండి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు రూ. 20,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుంది.
అదే సమయంలో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతికి ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications