హైదరాబాద్ లో డ్రైవర్ లెస్ బస్సులు పరుగులు- తొలి నగరంగా..!!
హైదరాబాద్ మరో కీర్తి దక్కించుకుంది. దేశంలోనే తొలి సారిగా డ్రైవర్ రహిత బస్సులు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల్లో డ్రైవర్ ఉండదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు అదే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటుంది, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అదే బ్రేక్స్ వేసుకుంటుంది. ఇప్పటికే ఆ బస్సులు ఐఐటీ హైదరాబాద్ లో వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో త్వరలోనే ఎంపిక చేసిన మార్గాల్లో వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు ఈ బస్సుల్లో ప్రయాణం ఆసక్తి కరంగా మారుతోంది.
హైదరాబాద్ లో డ్రైవర్ రహిత బస్సులు వచ్చేసాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం టెక్నాలజీని వినియోగించి ఈ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఇవి క్యాంపస్ లో వినియోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇవి పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. ప్రస్తుతం వర్సిటీలో రెండు రకాల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి సిక్స్ సీటర్, మరొకటి ఫోర్టీన్ (14) సీటర్ బస్ గా ఉన్నాయి. వీటిల్లో ప్రయాణించిన వారి అభిప్రాయాలు.. సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. పూర్తి సాంకేతికత ఆధారంగా వీటి ప్రయాణం కొనసాగుతోంది.

ఐఐటీ హైదరాబాద్లోని ప్రత్యేక పరిశోధన విభాగం 'టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమనస్ నావిగేషన్' ఈ డ్రైవర్ లెస్ బస్సులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కుంది. ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు, సిబ్బంది ఈ డ్రైవరు రహిత బస్సుల్లో మెయిన్ గేటు నుంచి వర్సిటీలోని అన్ని చోట్లకు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ రహిత బస్సుల్లో అమర్చిన అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ బస్సు వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగ పడతాయని సిబ్బంది వివరించారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో దానికి ఏవైనా అడ్డుగా వస్తే, ఏఐ టెక్నాలజీ ద్వారా వాటిని గుర్తించి, సురక్షితమైన దారిలో ప్రయాణించేలా సాంకేతికత ను రూపొందించారు. ఈ బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి చాలా వరకు సానుకూల స్పందన వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ బస్సుల గురించి తెలుసుకోవటానికి హైదరాబాదీలు ఆసక్తి చూపుతున్నారు.












Click it and Unblock the Notifications