తెలంగాణలో 18 ఏళ్లు నిండిన రైతులకు అలర్ట్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అన్నదాతల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, పసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తుంది. అలానే ఇప్పటికే పంట పెట్టుబడుల కోసం రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రైతు బీమా పథకం కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తుల చివరి తేదీ..
వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం, రైతు బీమాకు కొత్తగా నమోదు కావడానికి ఆగస్టు 13 చివరి తేదీగా నిర్ణయించారు. కొత్తగా పట్టాదారు పాస్ బుక్స్ పొందిన వారు..గతంలో పాస్ బుక్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ రైతు బీమా పథకం 2018 ఆగస్టు 14 ప్రారంభం అవ్వగా.. రైతు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించనుండగా.. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఇది వర్తిస్తుంది. నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ అవుతుంది.
అర్హత ప్రమాణాలు..
- వయస్సు 18 నుండి 59 సంవత్సరాలు
- జనన తేదీ 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్య ఉండాలి
- తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండాలి లేదా MRO డిజిటల్ సంతకం చేసిన DS పేపర్
- రైతు ఆధార్ కార్డు
- నామినీ ఆధార్ కార్డు
ఈ పథకంలో రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం LICకి స్వయంగా ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రీమియం మొత్తం పెరుగుతున్నా, రైతులపై భారం వేయకుండా ప్రభుత్వం భరిస్తోంది.












Click it and Unblock the Notifications