కాంగ్రెస్‌కు షాక్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా, బీజేపీలో చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపినట్లు తెలిపారు.
రాజీనామా అనంతరం మహేశ్వర్ రెడ్డి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ మేరకు తాను బీజేపీలో చేరుతున్నట్లు మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.

ఈ సందర్భంగా కండువాను కప్పి.. తరుణ్ ఛుగ్, బండి సంజయ్ మహేశ్వర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్వర్ రెడ్డి కూడా తరుణ్ ఛుగ్‌కు శాలువాను కప్పి సత్కరించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నడ్డా నివాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి మహేశ్వర్ రెడ్డిని నడ్డా ఆహ్వానించారు.

కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను ఆ పార్టీ అధిష్టానం ఇటీవల అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పగడం గమనార్హం. తాజాగా, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications