నేడే దుబ్బాక ఫైట్ : కరోనా జాగ్రత్తలతో పోలింగ్... గ్రౌండ్‌లో ఇవీ ఏర్పాట్లు....
దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్దమైంది. నియోజకవర్గ ఓటరు మంగళవారం(నవంబర్ 3) తన ఓటును నమోదు చేయనున్నాడు. బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్యనే ఉండనుంది. దీంతో దుబ్బాక ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ శాతం ఎంతమేర నమోదవుతుందన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ పోలింగ్ తగ్గితే ఎవరికి లాభం... పెరిగితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.
Recommended Video

ఓటర్ల సంఖ్య...
ప్రస్తుతం దుబ్బాకలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే,85,92శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి కరోనా నేపథ్యంలో పోలింగ్ తగ్గుతుందా అన్న సందేహాలు లేకపోలేదు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 1,00,778 కాగా.. పురుష ఓటర్లు 97,098 మంది ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నాయి.

పోలింగ్ ఏర్పాట్లు
నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లో ఉన్న 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5గం. వరకు సాధారణ ఓటర్లు,ఆ తర్వాత 5 గం. నుంచి 6గం. వరకు కరోనా పాజిటివ్ ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గం మొత్తాన్ని 32 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌కు ఒక్కో పోలింగ్ ఆఫీసర్‌ను నియమించారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు ఒక్కో ఈవీఎంను ఏర్పాటు చేశారు. అయితే ముందు జాగ్రత్తగా మరో 120ఈవీఎంలను సిద్దంగా ఉంచారు.

కరోనా జాగ్రత్తలు...
దుబ్బాక ఉపఎన్నిక కోసం మొత్తం 2వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు కరోనా నియమ నిబంధనలు పాటించేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోనున్నారు. భౌతిక దూరం పాటించడం,ఫేస్ మాస్కులు ధరించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేయనున్నారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో శానిటైజర్లను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే... ఓటరును లోపలికి అనుమతిస్తారు. ఓటు వేసేటప్పుడు ప్రతీ ఓటరు చేతికి గ్లౌజులు ఇస్తారు. కరోనా పేషెంట్లకు పీపీఈ కిట్లు ఇచ్చి ఓట్లు వేసేలా చర్యలు తీసుకోనున్నారు.

యువత ఎటువైపు...
కరోనా నేపథ్యంలో దుబ్బాకలో 80 ఏళ్లు పైబడ్డ వృద్దులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో వీరి ఓట్లు 1550 ఉండగా.. ఇప్పటికే 1340 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. నియోజకవర్గ ఓటర్లలో ఈసారి యువత ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువత ఓట్లు దాదాపు 30వేల వరకు ఉండటంతో... అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావం చేసే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications