మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ - నోటిఫికేషన్, సర్వేలు తేల్చిందేంటి..!!
రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. పట్టణ ప్రజల మూడ్ ఎవరి వైపే స్పష్టం కానుంది. పంచాయితీ ఎన్నికలు పూర్తి కావటం తో ఇక మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల.. ఆ తరువాత ఎన్నికల నిర్వహణ దిశగా ప్లానింగ్ జరుగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పైన సర్వేలు పూర్తయ్యాయి. ఏ పార్టీ వైపు ప్రజలు ఆసక్తిగా ఉన్నారో అంచనాలు వెల్లడవుతున్నాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది.

ఈ నెల 10న తుది జాబితా వెలువరిస్తుంది. దీంతో ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారని సమాచారం.రాష్ట్రంలో ఇప్పటికే 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జనవరితోనే పాలన గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తూ వస్తున్నాయి.
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇక జీహెచ్ఎంసీకి వచ్చే ఫిబ్రవరి, మిగిలిన వాటికి మే నెల వరకు గడువు ఉంది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయా కమిషనర్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అటు ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుందనేది సర్వేలు చేయిస్తున్నాయి. సర్వే నివేదిక లు తమకే అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications