‘సంధ్య’ ఘటన: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun) బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ పుష్ప-2 బెనిఫెట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందున థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

కాగా, సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై ఇటీవల అల్లు అర్జున్ స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లానని తెలిపారు. అయితే థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల తాను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని చెప్పారు.
రేవతి చనిపోయారనే విషయం తనకు ఒకరోజు తర్వాత తెలిసిందని.. అయితే, స్పందించడానికి తనకు సమయం పట్టిందని, అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు అల్లు అర్జున్. రేవతి చనిపోవడం బాధగా ఉందన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రూ. 25 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పిన అల్లు అర్జున్.. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు.
మరోవైపు, అల్లు అర్జున్.. పుష్ప-2 సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. పుష్ప2 విజయమంతా దర్శకుడు సుకుమార్‌దే అని అల్లు అర్జున్ అన్నారు. తనను ఎత్తుకొన్ని ఎక్కడో పెట్టాడని సుకుమార్‌ని కొనియాడారు. తొలిరోజు వచ్చిన 'పుష్ప 2' కలెక్షన్లే తన సినిమా ఎంత మంది చూశారనడానికి నిదర్శనమని అన్నారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications