అల్లు అర్జున్‌కు లభించని ఊరట- చంద్రబాబుకు ఎలా? వైసీపీ
Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది.

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త దావానలంలా వ్యాపించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బారులు తీరుతున్నారు. తొలుత ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, భార్య స్నేహారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.
నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, నాగవంశీ, మైత్రీ రవి సహా పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ బాట పట్టారు. విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రీకరణను క్యాన్సిల్ చేసుకున్నారు. భార్య సురేఖతో కలిసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అరెస్ట్ అయిన తరువాత కొద్దిసేపటికి ఆయనను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు కొనసాగాయి. డిశ్చార్జ్ చేసిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీదేవి ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించారు.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఘాటుగా స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హస్తం ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్‌కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.
ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఏ తప్పూ చేయలేదని అన్నారు. భారీ అంచనాలతో ఓ సినిమా విడుదల అవుతోందని, అదేస్థాయిలో అభిమానులు థియేటర్‌కు వస్తారనే విషయం తెలంగాణ ప్రభుత్వానికి ముందే తెలుసి ఉంటుందని, అయినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తొక్కిసలాట చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు.
చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో పుణ్యస్నానాలను ఆచరించేటప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించిన విషయాన్ని లక్ష్మీ పార్వతి గుర్తుచేశారు. ఈ ఘటనలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేసి ఉండాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications