ఆ ఒక్కటీ తక్కువైంది పుష్పా..! మళ్లీ పోలీసుల పిలుపు వెనుక ?
హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో చోటు చేసుకున్న తొక్కిసలాట, మహిళ మృతి తర్వాత చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ ను ఈ కేసులో ఏ11గా చేర్చారు. అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ప్రాథమికంగా విచారణ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. రిమాండ్ కు పంపారు. అనంతరం గంటల్లోనే బెయిల్ పై ఆయన విడుదల కావడంతో ప్రభుత్వం అల్లు అర్జున్ పై ఆగ్రహంగా ఉంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఇది స్పష్టంగా కనిపించింది.
అల్లు అర్జున్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎంత సీరియస్ గా ఉందో తేలిపోయింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న వారు (పోలీసులు) తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న వ్యాఖ్యలు చేయడంతో సమస్య మరింత ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై దాడి కూడా జరిగింది. దీనిపై విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు కూడా. అయితే అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేసి మరోసారి విచారణకు పిలవడం మాత్రం చర్చనీయాంశమైంది.

అల్లు అర్జున్ ను ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన నోటీసు నేపథ్యంలో ఆయన వాంగ్మూలం నమోదు కోసం పిలిపించారా లేక అదనపు వివరాలు రాబడతారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రెస్ మీట్లో పోలీసులు ప్రభుత్వానికి సరైన వివరాలు ఇవ్వడం లేదని అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకే ఆయన్ను పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పోలీసుల్ని ఇరుకునపెట్టాయి. దీనిపై ఇప్పటికే వీడియోలు, ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్న పోలీసులు తమ తప్పిదం ఏమీ లేదని చెబుతున్నారు. ఇవాళ విచారణలో సైతం అల్లు అర్జున్ ను ఇవే అంశాలపై ప్రశ్నించి ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications