ఖమ్మంలో బీజేపీ లేదంటున్నారు: 15న అమిత్ షా సభతో తేల్చాద్దామంటూ బండి సంజయ్
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన ఆయన.. బీజేపీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు.
ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూన్ 15న ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు భారీగా తరలివచ్చి బీజేపీ బలమెంటో ఇక్కడి కార్యకర్తలు చూపాలన్నారు బండి సంజయ్. అమిత్ షా మీటింగ్ సక్సెస్ అయితే కొత్తగూడెంకు ప్రధాని మోడీ వస్తారని చెప్పారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించబోతున్నామని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను రెండుసార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు బండి సంజయ్.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఉత్సవాలు చేసేందుకు కార్యకర్తలు, నాయకులు లేరని.. బీజేపీ ఎమ్మెల్సీ గెలిస్తే ప్రతి మండలంలో ఉత్సవాలు చేశారన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి లేపినా లేవలేని పరిస్థితిలో ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి బాగా నమ్మకం ఉందన్నారు. జిల్లాలో కమలం తప్పకుండా వికసిస్తుందన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీస్ సిబ్బందికి కూడా వారికి రావాల్సిన అలవెన్స్‌లు ఇవ్వడం లేదన్నారు. అప్పుల రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా మారాలన్నారు. ఇవాళ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా మోడీ తొమ్మిదేళ్ల పాలనను చేసిన అభివృద్ధిని వివరిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications