చంద్రబాబుతో పొత్తుపై అమిత్ షా ట్విస్ట్: జగన్ పార్టీ అసంతృప్తి!
ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టిడిపితో ఎన్నికల పొత్తు ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పారు. బిజెపి - టిడిపి పొత్తుకు సంబంధించి ఏ క్షణమైనా పొత్తులో కొత్త ట్విస్ట్ ఉండవచ్చునని చర్చ సాగుతున్న తరుణంలో అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేయడం విశేషం
మంగళవారంనాడు మీడియా సమావేశంలో టిడిపితో ఏపీలో పొత్తు ఉంటుందా అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై అమిత్ షా స్పందించారు. ఏపీలో ఇప్పటికైతే పొత్తు ఉంటుందని, ఇప్పటికి ఇంతేనని చెప్పారు.
ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు ఏపీలో పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే, ఏపీ బీజేపీ నేతలు మాత్రం టిడిపితో దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా గానీ, వెంకయ్య నాయుడు గానీ 2019 ఎన్నికల్లో పొత్తు ఉంటుందా, లేదా అనే స్పష్టతను ఇవ్వలేదు.

అమిత్ షా ఆసక్తికరం
టిడిపి, బిజెపి మధ్య పొత్తుపై చర్చ సాగుతున్న సమయంలో అమిత్ షా వరుస వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన సోమవారం నల్లగొండలో చెప్పారు. దాన్ని పలువురు ఏపీకి కూడా ఆపాదించారు. చంద్రబాబుతో తెగతెంపులకు సిద్ధపడ్డారనే విశ్లేషణలకు దిగారు. మంగళవారం నాటి మాటలు మాత్రం పొత్తుపై సందిగ్ధతను తెలియజేస్తున్నాయి. అయితే, జగన్ పార్టీని వెయిటింగ్‌లో పెట్టడం అమిత్ షా ఉద్దేశ్యమా, మరో ఆలోచన ఏదైనా ఉందా అనేది తెలియడం లేదు.

చంద్రబాబుపై ఆగ్రహమా, అనుగ్రహమా?
ప్రస్తుతం ఏపీలో టిడిపితో పొత్తు కొనసాగుతుందని వెంకయ్య, అమిత్ షా వంటి నేతలు చెప్పారు. కానీ 2019లో ఏం చేస్తామనేది చెప్పలేదు. రాజకీయాలు ఎప్పటికి అప్పుడు మారుతుంటాయి. కాబట్టి అది చెప్పడం కూడా సాధ్యం కాదనవచ్చు. పైగా ఏపీలోని టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదగాలనుకుంటోంది బిజెపి. అమిత్ షా వ్యాఖ్యలు తాత్కాలికంగా చంద్రబాబుకు ఊరటనిచ్చేవని చెప్పవచ్చు.

అసంతృప్తిని కలిగించేదే
జగన్‌తో కలిసి లేదా అంతర్గతంగా ఒప్పందంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది. మరి ప్రస్తుతానికైతే అమిత్ షా టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. మరి ప్రధాని మోడీతో వైసిపి అధినేత జగన్‌తో భేటీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో వైసిపి ఆనందంలో ఉంది. బిజెపి - టిడిపి మధ్య ఎప్పుడెప్పుడు పొత్తు వీడిపోతుందా అని చూస్తున్న వైసిపికి మరో రెండేళ్లపాటు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది అసంతృప్తిని కలిగించేదే.

ఏపీ పర్యటనకు ముందే తేల్చేశారు
జగన్ - మోడీ భేటీపై పెద్ద దుమారమే చెలరేగింది. మోడీతో జగన్ భేటీపై టిడిపి నేతలు చేసిన విమర్శలపై ఏపీ బీజేపీ నేతలు దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలు టిడిపి వద్దనుకుంటున్న పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతలకు ఏ విధమైన సంకేతాలను ఇచ్చినట్లు అనేది తెలియడం లేదు. ఇప్పటికైతే టిడిపితోనే ఉంటామని తేల్చి చెప్పారు. దీంతో 2019పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications