ఆంధ్రావారు సన్నాసులా! వారిని జైల్లో పెట్టుకోవచ్చు: కేసీఆర్‌కు ప్రశ్న
హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో సెక్షన్ 8ను వెంటనే అమలు చేయాలని ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు వీర రాఘవ రెడ్డి శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. ఆంధ్రా మూలాలు ఉన్న వారికి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేపదే ఆంధ్రావారిని సన్నాసులు అనడం ఏమాత్రం సరికాదన్నారు. కేసీఆర్ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఎలా నిలిపివేశారని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో దోషులను తేలితే వారిని అరెస్టు చేసి జైలులో పెట్టుకోవచ్చునని చెప్పారు. తమను మాత్రం ఇక్కడ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయాలి: పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసు విచారణ సాగుతుండగానే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
చంద్రబాబు పైన ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినప్పటికీ కర్నూలు, ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications