కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలురాయి అన్నారం బ్యారేజ్ లీకేజ్: వదిలిపెట్టని రేవంత్ రెడ్డి
మొన్నటికి మొన్న మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన మరిచిపోకముందే తాజాగా అన్నారం బ్యారేజ్ పిల్లర్ల క్రింద నుండి వాటర్ లీకేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు మాత్రం అది ఆయుధంగా మారింది. కేసీఆర్ పరువును నిలువునా తీస్తూ కాళేశ్వరం లోపాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో సాగునీటి వసతి కల్పించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాంకేతిక లోపాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కెసిఆర్ ను టార్గెట్ చేయడానికి ప్రధాన అస్త్రాలుగా మారాయి. తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజ్ పిల్లర్ల క్రింద నుండి వాటర్ లీకేజ్ అవుతున్న ఘటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

ఇది కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలురాయి అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి నిన్న మేడిగడ్డ నేడు అన్నారం అంటూ ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేశారు. అక్కడ కూలుతున్నది బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు అంటూ మండిపడిన రేవంత్ రెడ్డి, ప్రాజెక్ట్ అంటే నీ ఫామ్ హౌస్ కి ప్రహరీగోడ అనుకున్నావో.. లేక నీ మనవళ్ళు ఆడుకునే ఇసుకగూళ్ళు అనుకున్నావో అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు.
రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు అని మండిపడిన రేవంత్ రెడ్డి వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం..మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు అంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ల వద్ద నీటి బుంగ ఏర్పడడంతో ఆ బుంగ పూడ్చేందుకు ఇసుక బస్తాలను వేస్తున్న వీడియోలను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఇది కేసీఆర్ పనితనం అని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications