కేటీఆర్‌పై మరో కేసు నమోదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం ఏసీబీ విచారణ అనంతరం బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ తోపాటు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మున్నె గోవర్ధన్, క్రిశాంక్, జైసింహ, తదితరులపై 305, r/w 62 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, ఫార్ములా ఈ రేస్ కేసులో గురువారం కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు నుంచి బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్ వరకు కేటీఆర్ ర్యాలీగా వెళ్లారు.

అయితే, అనుమతి లేకుండా ర్యాలీ తీసి వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కేటీఆర్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు, గురువారం విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ అడ్డుకున్నారు.
ఇక్కడ మాట్లాడొద్దని.. పార్టీ ఆఫీసుకు వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కేటీఆర్‌కు ఆయన సూచించారు. దీంతో మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయపమంటూ డీసీపీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడ్నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.
ఇది ఇలావుండగా, ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని.. అలా 82 ప్రశ్నలు అడిగారని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టించారని ఏసీబీ అధికారులకు కూడా అర్థమైందన్నారు.
కేసులో ఎలాంటి విషయం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ అనేదాన్ని తొలిసారి ఇండియాకు తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో కొనసాగించాలని భావించామన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఈవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే సదుద్దేశంతో పనిచేశామని తెలిపారు.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదని.. అవినీతి పనులు తాము చేయమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తానని తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏసీబీ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటివి మరో వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.
తమపై ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా ఈ ఏడాదంతా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో, ఎక్కడా అవినీతి లేకుండా పనిచేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications