అడ్రస్ అడిగి చైన్ స్నాచింగ్: భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా మంగళవారం చిరునామా అడుగుతూ నగరంలోని లంగర్ హౌస్‌లో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఐదు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంచుకెళ్లిన సంగతి తెలిసిందే.
వరసుగా చైన్ స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం లంగర్ హౌస్ గాంధీనగర్‌లో నివాసం ఉండే కల్పలతా రెడ్డి(45) మంగళవారం ఉదయం 7 గంటలకు తన ఇంటి ముందు ఊడుస్తోంది.
ఆ సమయంలో పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు ఆమె ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపారు.
ఇంతలో ఒకడు వాహనం దిగి కల్పలతా రెడ్డి వద్దకు వచ్చాడు. తమకు ఈ అడ్రస్ ఎక్కడో చెప్పాలంటూ అడుగుతూ ఆమె మెడలోని 6 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. పక్కనే బైక్‌పై వేచి చూస్తున్న వ్యక్తితో కలిసి పారిపోయాడు. స్థానికులు చైన్ స్నాచర్స్‌ను వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
భార్యపై కట్టుకున్న భర్తే హత్యాయత్నం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేటలోని పాముకుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, వీరాస్వామి, రమా అనే దంపతులు పాముకుంటలో నివాసం ఉంటున్నారు.
వీరిద్దరి మధ్య ఓ చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో భర్త, భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య తీవ్ర గాయాలు పాలైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications