బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి- తీవ్ర ఉద్రిక్తత
నిర్మల్: జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బాసరలో గల ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతిచెందారు. హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహంతో విద్యార్థులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తోన్నారు.
మృతురాలి పేరు బూర లిఖిత. బాసర రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. సిద్ధిపేట్ జిల్లా గజ్వేల్ ఆమె స్వస్థలం. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి మరణించినట్లు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డ్, హాస్టల్ సిబ్బంది లిఖితను హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లిఖిత మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. లిఖిత మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆమె కాలు జారి కిందపడి మరణించినట్లు వార్తలు వస్తోండగా.. బలవన్మరణానికి పాల్పడిందనే వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
అంతకుముందు- బాసర ట్రిపుల్ ఐటీ పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థిని దీపిక రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన విస్మరించకముందే మరో విద్యార్థిని మృతిచెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ వెంకటరమణను ఘెరావ్ చేశారు.
లిఖిత ప్రమాదవశాత్తు మరణించినట్లు భావిస్తున్నామని వీసీ తెలిపారు. ఫోన్ చూస్తూ భవనం పైనుంచి జారి పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. నిఖిత మరణించిన వార్త తెలియగానే ఆయన నిర్మల్ జిల్లా ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మరణిస్తోన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications