ఏపీ, తెలంగాణకు మరో వందేభారత్
భారతీయ రైల్వే వందేభారత్ రైలును తమ తరుఫుముక్కగా భావిస్తోంది. ప్రవేశపెట్టిన అన్ని ప్రాంతాల్లో ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తుండటంతో దేశవ్యాప్తంగా మారిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రయాణికులు నెమ్మదిగా అలవాటుపడిపోతారనే యోచనలో భారతీయ రైల్వే ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందేభారత్ రైళ్లకు తోడుగా మరో వందేభారత్ ను పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం శతాబ్ది ఒకటే నడుస్తోంది
సికింద్రాబాద్ నుంచి పుణె వరకు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పుణెకు కేవలం శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఒకటే నడుస్తోంది. ఇది మధ్యాహ్నం నుంచి బయలుదేరుతుంది. అలా కాకుండా వందేభారత్ నుంచి ఉదయమే ప్రారంభించేలా చూడాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సర్వీస్ అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటంలేదు. ప్రవేశపెట్టడమే 20 రేక్స్ తో ప్రవేశపెట్టారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోతుండటంతో బోగీలు కుదించి ఎనిమిది బోగీలతో నడపబోతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు నాలుగు రైళ్లు నడుస్తున్నాయి.

సిట్టింగా? స్లీపరా?
భారతీయ రైల్వే త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతోంది. ఇవి ఏయే మార్గాల్లో ప్రయాణించాలనే రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. 16 మార్గాలను నోటిఫై చేశారు. అయితే సికింద్రాబాద్ నుంచి పుణెకు వందేభారత్ సిట్టింగ్ కాకుండా స్లీపర్ సర్వీస్ ను రాత్రివేళ ప్రారంభిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, పుణె.. రెండు నగరాలు ఐటీ నగరాలు కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆక్యుపెన్సీ బాగుంటుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రవేశపెడితే ఆదరణ పొందడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బోగీలు అందుబాటులో లేకపోవడంతో వందేభారత్ సిట్టింగ్ ప్రవేశపెట్టడం ఆలస్యమవుతోంది. సిట్టింగా? లేదంటే స్లీపరా? అనేది అతి త్వరలోనే ఖరారు కానుంది.












Click it and Unblock the Notifications