విభజన చట్టం మేరకే ఏ వివాదమైనా పరిష్కారం, ఆర్టీసీ ఆస్తులూ అంతే: సీఎం కేసీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏ వివాదమైనా పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకంపై రేపటి సమావేశం నేపథ్యంలో తెలంగాణ వైఖరిపై సీఎం కేసీఆర్ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒక వాస్తవం. ముందు ఈ వాస్తవాన్ని అంతా అంగీకరించాలన్నారు.

cm-kcr

విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలని, ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలని, రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన కూడా జరుగుతుందని, రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే ఆర్టీసీ విభజనకు వర్తిస్తాయని కేసీఆర్ అన్నారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ రాష్ట్ర మౌలిక విధానానికి అనుగుణంగానే ఏపీతో విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకుంటామని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ నిబంధనలు అమలు చేశారో ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా కూడా అవే పాటించారన్నారు.

ఏమైనా సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని చెప్పారు. అలా సాధ్యం కాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. ఇంకా వివాదం పరిష్కారం కాకుంటే ఏం చేయాలనే విషయంలోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.

పార్లమెంటు చేసిన చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయని తెలిపారు. ఇందులో బోర్డు చేతిలో ఎలాంటి అధికారం లేదని, ఇదే వైఖరిని విజయవాడలో జరిగే సమావేశంలో వెల్లడించాలని సీఎం నేతలకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR told the officials on Thursday night that any issue will be solved according to the State Bifurcation Act only. On Friday at Vijayawada.. there will be a meeting between AP and Telangana regarding the bifurcation of RTC. CM KCR conducted a review meeting with the concerned officials on this issue in hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి