ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు! పదవిలో ఉన్నా లేకున్నా.. విచారణకు అందుబాటులో ఉండాలని..
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. కమిటీకి అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది.పదవిలో ఉన్నా లేకున్నా విచారణకు హాజరు కావాల్సిందేనని కమిటీ ఆదేశించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6న తనను హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. బుధవారం(మార్చి 18) కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి ఆయన ఫిర్యాదును పరిశీలించి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కమిటీ విచారణకు అందుబాటులో ఉండాలని స్పీకర్ కార్యాలయ సెక్రటరీ ద్వారా నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తోంది.
కాగా,రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు,16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. దీనిపై పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లడంతో నిమ్మగడ్డకు షాక్ తప్పలేదు. ఎస్ఈసీ ఆదేశాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతినిచ్చింది.

ఇక ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలకు న్యాయపరమైన అవరోధాలు తొలగినందునా... వెంటనే ఆ ఎన్నికలు కూడా నిర్వహించాలని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. . ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని చెప్పిన పెద్దిరెడ్డి... ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని కోరారు. ఎన్నికలు పూర్తి అయితేనే..వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంటే... ఆంధ్రాలో మాత్రం ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యమైందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిపితే బాగుండేదని, స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications