జగన్‌పై రేవంత్ తొలి ఆరోపణ: షర్మిలతో భేటీ తరువాత మారిన స్వరం
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. తన తొలి అస్త్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కుపెట్టారు. అది కూడా.. ఆయన చెల్లెలు షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఓ తెలుగు న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల చుట్టూ ఎక్కువగా నడించిందీ బిగ్ డిబేట్. వైఎస్ జగన్ పరిపాలన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీదా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేసుకున్నారాయన ఈ సందర్భంగా.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటివరకు వైఎస్ జగన్.. తనకు ఫోన్ కాల్ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రలు ఫోన్ చేసి, అభినందిస్తుంటారని, ఇప్పటి వరకు జగన్ నుంచి అలాంటి కాల్ రాలేదని చెప్పారు.
సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటోన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఆయన ఇంటికి వెళ్లిన విషయాన్నీ రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్‌ను పరామర్శించడానికి ఏపీ నుంచి అదేపనిగా హైదరాబాద్‌కు వచ్చిన జగన్.. తనకు ఫోన్ చేయలేదని చెప్పారు.
నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని జగన్ కోరుకుంటోన్నారని, తాను మాత్రం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే పట్టుదలతో ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని జగన్ ఆకాంక్షించారని, తాను మాత్రం కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు.

కేసీఆర్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఆయనను పరామర్శించాలంటూ రాహుల్ గాంధీ తనను ఆదేశించారని, అందుకే ఆసుపత్రికి వెళ్లానని రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ నెల 26వ తేదీన దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం తెలంగాణ శకటాన్ని ప్రదర్శించడానికి మోదీ అంగీకరించారని వివరించారు.
ప్రొఫెసర్ కోదండరామ్‌ను శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్- రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని రేవంత్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications