87కేసులు.. కేసీఆర్ యాక్షన్‌కు ఏపీ రియాక్షన్: బాబు ఇంటి వద్ద ఏపీ పోలీస్, మాకు టీ పోలీస్ వద్దు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠకు గురవుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రేపోమాపో నోటీసులు ఇస్తారనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యకు ప్రతి చర్యకు సిద్ధమైంది. ఈ రోజు గవర్నర్ నరసింహన్‌ను ఏపీ పోలీసు ఉన్నతాధికారులు కలవనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ పైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్, ఏసీబీల పైన పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీనిపై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కేసీఆర్ పైన ఏపీలో 87 చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆయనకు తాము నోటీసులు ఇస్తామని చెప్పారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా ఏపీ ప్రతిచర్యకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

చంద్రబాబుకు నోటీసులపై వాదనలు
చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదా తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ఓటుకు నోటు వ్యవహారంలో స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోకుండా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి నివేదికలు రాకుండా నోటీసులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏసీబీ దూకుడు ధోరణితో ముందుకు వెళ్తే ఏపీ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతోంది.
మా భద్రత మేమే చూసుకుంటాం: ఏపీ పోలీసులు
తమ భద్రత తామే చూసుకుంటామని ఏపీ పోలీసులు కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఏపీ డీజీపీ, సీఎస్‌లు నరసింహన్‌తో భేటీ కానున్నారు. తమకు తెలంగాణ ప్రభుత్వం భద్రత అవసరం లేదని చెప్పనున్నారు. మరోవైపు, చంద్రబాబు ఇంటి వద్ద ఏపీ పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications