చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయగలరా?: ఒవైసీ సవాల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం సాగుతోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనత పార్టీతో పాటు ఏఐఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు- ప్రతివిమర్శలను సంధించుకుంటోన్నారు ఆయా పార్టీల నాయకులు.
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ హెచ్చరించారాయన. పాకిస్తాన్ తరువాత ఆ స్థాయిలో ఉగ్రవాదులు పాతబస్తీలో మకాం వేశారని, వారిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ అండదండలతో ఉగ్రవాదులు పాతబస్తీని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారంటూ ఆరోపించారు.

దీనిపై తాజాగా- ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాల్ విసిరారు. లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దుల వెంబడి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తోందని అన్నారు. సరిహద్దుల్లో గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోందని, అలాంటి చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు.
రోజుల తరబడి మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయని, వాటికి బీజేపీయే కారణమని ఒవైసీ విమర్శించారు. మనుషుల మధ్య చిచ్చు పెడుతోందనడానికి మణిపూర్ ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. మసీదును పోలి ఉన్నాయనే కారణంతో బీజేపీ నేతలు తెలంగాణ కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చుతామని హెచ్చరిస్తున్నారని, కూల్చివేతలు బీజేపీ నాయకులకు అలవాటైన పనిగా అభివర్ణించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏఐఎంఐఎంకు రహస్య అవగాహన కుదిరిందంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ తోసిపుచ్చారు. కేసీఆర్‌తో తనకు రహస్య అవగాహనే ఉంటే హిందూ ఆలయాలకు కోట్లాది రూపాయలు ఎలా మంజూరవుతున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తన చేతిలో ఉందంటూ అమిత్ షా చెబుతున్నారని, ఒకవేళ ఉంటే ఆయనకు బాధ ఎందుకు? అని ఎద్దేవా చేశారు












Click it and Unblock the Notifications