ఆశా వర్కర్‌ను కారులో ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విధులకు వెళ్లి వస్తున్న ఆశా పర్కర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
ఆశా వర్కర్ నర్సాపూర్‌లో ఓ సమావేశానికి హాజరైంది. సమావేశం పూర్తయిన తర్వాత రాత్రి పూట ఇంటికి వచ్చేందుకు ఆమె నర్సాపూర్ బస్టాండ్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఆమెను కారులో ఎక్కించుకుని అపహరించారు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. రాత్రంతా వాన పడడంతో ఆ వైపు ఎవరూ వెళ్లలేదు. దీంతో ఆమెను ఎవరూ గమనించలేదు. రాత్రంతా ఆమె అక్కడే ఉండిపోయింది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవుతోందని, ఆమె దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదని చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆశావర్కర్‌ను హైదరాబాదు తరలించాలని వైద్యులు పోలీసులకు సూచించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications