తెలంగాణ ఆశా వర్కర్లకు కేసీఆర్ సర్కారు మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై నుంచి ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆశా వర్కర్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. ఆశ వర్కర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని హరీశ్ రావు సూచించారు.
పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
వ్యాధితో బాధపడుతున్నవారు వైద్యుడు, సిబ్బందిని దేవుడిగా భావిస్తారన్నారు. పిల్లలకు 100 శాతం వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 100 శాతం ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు సాధించామని తెలిపారు. వైద్య ఆరోగ్యంలో 14వ స్థానంలో ఉండగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ స్థానానికి తీసుకొచ్చామన్నారు.

తెలంగాణ ముందు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం, 30 శాతం డెలివరీలు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తోందని తెలిపారు. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే.. కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ అని ప్రతిపక్ష పార్టీలకు చురకలంటించారు. కుల మతాల చిచ్చుపెట్టే పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఆశా వర్కర్లు చెప్పాలన్నారు మంత్రి హరీశ్ రావు. టి డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఒక్కో ఆశ వర్కర్‌పై 50 వేలు ఖర్చు పెట్టి శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చి దిద్దుతామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు జులై నుంచి సెల్‌ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక వేతనం ఆశా వర్కర్లకు తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఆశా వర్కర్ల గురించి పట్టించుకోలేదన్నారు. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications