రాజ్‌భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం: మూడోసారి హాజరుకాని సీఎం, పార్టీల నేతలు కూడా
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ నేతలెవరూ హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనలేదు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి సుభాష్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖులు గవర్నర్ ఎట్ హోంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరినీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్యాయంగా పలకరించారు.
ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ఈసారి కొంత సందడి తగ్గిందని చెప్పాలి. కాగా, రాజ్ భవన్‌లో తమిళిసై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. బిల్లులపై స్పందించేందుకు ఇది సరైన సమయం కాదన్నారు గవర్నర్.
త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా, రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గత కొంత కాలంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు నేరుగా గవర్నర్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications