ఆ ఏటిఎంలో రూ. 100 కొడితే.. 500లు వస్తోంది!: బారులు తీరారు
మెదక్: ఎక్కడైనా ఏటిఎంకెళ్లి రూ. 100 తీసుకోవాలని టైప్ చేస్తే.. మనకు వంద రూపాయలే వస్తాయి. కానీ, ఇక్కడ మాత్రం రూ. 100 టైప్ చేస్తే.. ఏకంగా రూ. 500లు వచ్చేస్తాయి. ఈ విషయం తెలిసిన జనాలు ఆ ఏటిఎం ముందు బారులు తీరారు. ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్న ఏటిఎం ఏదంటే.. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బస్టాండ్‌లోని ఇండిక్యాష్ ఏటిఎం.
సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు వందల రూపాయలు డ్రా చేస్తే రెండు 500 నోట్లు.. అంటే వెయ్యి రూపాయలు ఖాతాదారుని చేతిలో పడ్డాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇలా రెండు వందలకు వెయ్యి, నాలుగు వందలకు నాలుగు ఐదు వందలనోట్లు రావడంతో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు ఖాతాదారుల తాకిడి పెరిగింది.
ఎక్కువ డబ్బులు వస్తున్న విషయం తెలుసుకుని వారి మిత్రులకు చెప్పడంతో వారంతా క్యూ కట్టారు. ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకున్న వారిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. మధ్యాహ్నానికి విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ గోపినాథ్ అక్కడికి వచ్చి పరీశీలించారు.

సంబంధిత అధికారులకు సమాచారం తెలిపి ఏటీఎంకు కరెంటు సరఫరా నిలిపేశారు. అయినా.. ఏటీఎంకు ఉన్న ఇన్‌వర్టర్‌తో ఏటీఎం పనిచేస్తోంది. దీంతో మరోసారి ఖాతాదారుల తాకిడి పెరిగింది.
దీంతో మళ్లీ వచ్చిన ఎస్‌ఐ ఇన్‌వర్టర్ నుంచి సైతం కరెంటు సరఫరాను నిలిపివేయడంతో ఏటీఎం పనిచేయడం నిలిచిపోయింది. ఆ ఏటీఎంలో 15 రోజుల క్రితం కూడా ఇలా వందకు వెయ్యి రూపాయలు డ్రా అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications