రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తెలంగాణలో ఆటో, క్యాబ్ సమ్మె విరమణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక సమ్మె విరమించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. అంతుకుముందు ఆటో జేఏసీ నేతలు, రవాణాశాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్చువల్ గా మాట్లాడారు. బంద్ విరమించాలని ఆటో జేఏసీ నేతలను కోరారు. యూనియన్ల డిమాండ్స్ పట్ట మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విజయవంతం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. అంతకుముందు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్‌లు నిలిపివేయాలని 'కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ' పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జేఏసీ నేతలు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ట్వీట్ పెట్టారు. " ఆటో కార్మిక సంఘాల తో జరిగిన చర్చలు సఫలం. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆటో కార్మిక సంఘాల నిరవధిక బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ధన్యవాదాలు" అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
"ఆటో కార్మిక సంఘాల కు ప్రభుత్వం నుండి సానుకూల అంశాలు.. ఆర్టీసీ పక్షాన ఈవి ఆటో లు కొనే ప్రసక్తే లేదు అది దుష్ప్రచారం మాత్రమే.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది.. విధివిధానాలకు సెప్టెంబర్ 1 వ తేదీ కార్మిక శాఖ & రవాణా శాఖ & ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం జరగనుంది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదు కాబట్టి ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి అంగీకారం. ఓలా, ఉబెర్ లా మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం ప్రభుత్వం ఐటీ శాఖ నుండి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తాం.. ద్విచక్ర వాహనాల్లో రాపిడో,ఓలా ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపు పై నిర్ణయం తీసుకుంటాం" అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

"గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు 12 వేల రూపాయల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణన లోకి తీసుకొని ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, సహచ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో పాత డీజిల్ , పెట్రోల్ ఆటో లకు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటో లుగా మార్చడానికి 1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కొత్త ఆటో లు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవి ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆటో కార్మికుల సోదరులు వారి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉంది.. అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications