అయోధ్య రామయ్య పాదుకల తయారీ ఇక్కడే.. భాగ్యనగరం పేరు సార్ధకం!!
జగదభిరాముడు, సకల సద్గుణ శోభితుడు, ఏకపత్నీవ్రతుడు, కౌసల్య పుత్రుడు అయిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశ ప్రజలందరూ అచ్చెరువొందేలా జరిగింది. ఈ రామ మందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ట జనవరి నెల 22వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందువులందరూ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామయ్య కొలువు తీరనున్నారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. శ్రీ రామచంద్ర మూర్తి కి పాదుకలు తయారు చేసే భాగ్యం మాత్రం మన హైదరాబాద్ కి దక్కింది. హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటారు. నిజంగానే హైదరాబాద్ ఇప్పుడు అయోధ్య రామయ్య పాదుకలను తయారు చేసి భాగ్య నగరంగా తన పేరును సుస్థిరం చేసుకుంది.

అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లి లోని అనురాధ టింబర్ డిపోలో రూపు దిద్దుకోగా, శ్రీరామచంద్రుడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుండే తయారుచేసి పంపించడం నిజంగా సువర్ణ అవకాశం అని చెప్పాలి. సీతారామ చంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను రామయ్యకు పంపిస్తోంది.
ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు శ్రీరామ భజనలతో పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. మరో జత నేడు ఉదయం గగన మార్గాన విమానంలో బయలుదేరుతున్నాయి. శ్రీ రామయ్య పాదుకలు తయారు చేసి పంపడం తమ ఫౌండేషన్ చేసుకున్న అదృష్టమని ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు.
సుమారు 13 కేజీల బరువుతో వెండి పైన బంగారు తాపడం తో రూపొందించిన రెండో జత పాదుకలను సికింద్రాబాద్ బోయినపల్లి లోని హస్మత్ పేట లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ కళా కుటీర్ లో చాలా అందంగా రూపొందించారు. 25 రోజులపాటు శ్రమించిన శిల్పులు అత్యంత వైవిధ్యభరితంగా వీటిని తయారు చేశారు.
అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ వారు తయారు చేసిన ఈ రెండు జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఈ నెల 10 నుండి 15 తేదీలలలోపు అందించనున్నారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామయ్య పాదుకలను అయోధ్యకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications