అస్సాం విద్యార్థి హైదరాబాదులో: చదివింది బిటెక్, చేసింది ల్యాప్‌టాప్ చోరీలు
హైదరాబాద్: ఉద్యోగాలు రాకపోవడంతో ఓ బిటెక్ విద్యార్థి దొంగగా మారిన వైనం వెలుగు చూసింది. అస్సాంకు చెందిన ఆ విద్యార్థి బిటెక్ పూర్తి చేశాడు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో దొంగగా మారాడు. హాస్టళ్లలో ఉంటూ చలాకీగా ల్యాప్‌టాప్‌లను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కాడు.
అతని వద్ద నుంచి 10 ల్యాప్‌టాప్‌లను హైదరాబాదులోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ ఎం. వెంకటేశ్వర్లు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ బీటెక్ దొంగ వివరాలను వెల్లడించారు.
అస్సాం రాష్ట్రం నగామ్ జిల్లాకు చెందిన ఊదిప్తా దాస్ అలియాస్ బబులా (25) బల్కంపేట రేణుకానగర్‌లో నివాసం ఉంటున్నాడు. కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. తాను కళాశాలలో చదువుకునప్పుడు తీసుకున్న ఐడీకార్డు సహాయంతో ఎస్సార్‌నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో విద్యార్థిగా చెరుతూ సమయం చూసి తోటి విద్యార్థుల ల్యాప్‌టాప్‌లను దొంగిలించేవాడు.

అతను 2014 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను విక్రయించి తన అవసరాలు తీర్చుకునేవాడు. ఇలా కొంత కాలంగా పలు హాస్టళ్ల నుంచి 10కిపైగా ల్యాప్ టాప్‌లను అపహరించాడు. శుక్రవారం ఉదయం అమీర్‌పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు కనిపించాడు.
దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడిందని ఏసీపీ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ ఎస్‌ఐలు సునీల్ రెడ్డి, నగేష్, సిబ్బంది బాలకృష్ణ, ఉదయ భాస్కర్, చంద్రశేఖర్, జనార్ధన్, యాదగిరిని ఏసీపీ అభినందించారు.












Click it and Unblock the Notifications