టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన మేయర్ పారిజాత, పోరాడాలంటూ రాహుల్, రేవంత్ ఫైర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ నేత, బడంగ్‌పేట్ మేయర్ పారిజాతతో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

టీఆర్ఎస్ నేతల అబద్ధాలంటూ రేవంత్ ఫైర్
హైదరాబాద్‌ను కీలక నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ, కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని, రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. రాష్ట్రంలో కనీసం రహదారులపై గుంతలు పడితే పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వముందని రేవంత్ ఆరోపించారు.

తెలంగాణలో పోరాడాలంటూ రాహుల్ పిలుపు: రేవంత్
తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు రాహుల్. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఇతర నాయకుల మాదిరిగా సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించాం. మోడీ హయాంలో విదేశాల నుంచి దేశానికి రక్షణ లేకుండా పోయింది అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అందుకే కాంగ్రెస్‌లో చేరానంటూ టీఆర్ఎస్ మేయర్ పారిజాత
ఈ సందర్భంగా మేయర్ పారిజాత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఉందని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నా. కాంగ్రెస్ సీనియర్ నేతల సహకారంతో అభివృద్ధి కోసం కృషిచేస్తా. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశా. తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉంది అని బడంగ్‌పేట్ మేయర్ పారిజాత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications