తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష: ‘బలగం’పై ప్రశ్న ట్రెండింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది హాజరు కాగా, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష జరిగింది. కొన్ని చోట్ల వవిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో.. నిర్వహాకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.

మరోవైపు, నల్గొండ జిల్లా చండూరులో మరియానికేతన్ పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుండా జిరాక్స్ తెచ్చారని ఐదుగురిని సిబ్బంది బయటకు పంపించారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులనూ తిప్పి పంపారు.
కాగా, గ్రూప్-4 పరీక్షలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'బలగం'పై ఓ ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ప్రశ్నే ట్రెండ్ అవుతుండటం గమనార్హం. కమేడియన్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగు ప్రజల మనసులను హత్తుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-4 పరీక్షలో బలగం చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న విషయానికొస్తే..
ప్రశ్న: బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి?
దీనికి ఆప్షన్స్‌గా..
A. దర్శకుడు: వేణు యెల్దండి B. నిర్మాత దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో D. కొమరయ్య పాత్రను పోషించినది: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు
1. A, B, C మరియు D
2. A, B మరియు D మాత్రమే
3. A మరియు B మాత్రమే
4. A, B మరియు C మాత్రమే
కాగా, ఈ ప్రశ్నకు సరైన సమాధానం: 4
బలగం సినిమాలో కొమరయ్య పాత్రలో నటించింది సుధాకర్ రెడ్డి అనే సీనియర్ నటులు.
బలగం చిత్రానికి వేణు యెల్దండి దర్శకత్వం వహించగా.. దిల్‌రాజు, హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కొమురయ్య పాత్రను సుధాకర్ రెడ్డి పోషించగా.. ప్రశ్నాపత్రంలో మాత్రం కొమురయ్యపాత్రను అరుసం మధుసూదన్ అని ఇచ్చారు.
పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో దొరికిన అభ్యర్థి
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌లోని సక్సెస్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు పకడ్బంధీగా తనిఖీలు చేసినా.. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ ఎలా తీసుకెళ్లారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి.. అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు.
మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాగా, గ్రూప్-4 పరీక్షా కేంద్రంలోకి ఫోన్ తీసుకురావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications