'టీఆర్ఎస్ టెంట్ల కింద కోదండరాం స్పీచ్!, ఆ కుట్రలో భాగస్వామ్యం'
ప్రభుత్వంపై కోదండరాం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ఈ సందర్బంగా బాల్క సుమన్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వేసిన టెంట్ల కింద స్పీచులు ఇచ్చి పోవడం తప్ప.. ప్రొఫెసర్ కోదండరాం చేసిందేమి లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బ్రతికించేందుకే కోదండరాం ప్రయత్నిస్తున్నారని, గతంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన కుట్రలో ఆయనకు భాగస్వామ్యం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీజేఏసీని ఎద్దేవా చేస్తూ.. అది ఇప్పుడు కేజేఏసీగా మారిపోయిందన్నారు బాల్క సుమన్. సోమవారం నాడు టీఆర్ఎస్ఎల్పీలో సుమన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై కోదండరాం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ఈ సందర్బంగా బాల్క సుమన్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి సీఎం కేసీఆర్ పెద్ద పీఠ వేశారని సుమన్ అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగలేదన్నారు. కోదండరాం ఇకనైనా తన తీరును మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోదండరాం వ్యవహారశైలి కాంగ్రెస్ ఏజెంట్ లా ఉందని, ప్రభుత్వంపై బురద జల్లడం తగదని అన్నారు.

ఇక రైతుల సమస్యలపై కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును బాల్క సుమన్ విమర్శించారు. రైతులపై కోదండరాం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుందోన్నారు. మిషన్ భగీరథకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు.
కోదండరాం లాంటి వ్యక్తులు కొన్ని లక్షలు మంది అడ్డుపడినా.. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోలేరని బాల్క సుమన్ తేల్చి చెప్పారు. కోదండరాం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని సుమన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications