వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు: కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 3000 ఎకరాల భూమిని సమకూర్చినట్లయితే కేంద్రం వెంటనే ఒక టెక్స్‌టైల్ పార్కును మంజూరు చేస్తుందని జౌళి మంత్రి హామీ ఇచ్చారని వివరించారు.
గురువారం కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వార్‌తో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలతో కలిసి దత్రాత్రేయ భేటీ అయ్యారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ...వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం మాత్రమే కాకుండా అనుబంధ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు మంచి అవకాశాలు లభిస్తాయని దత్తాత్రేయ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నందున వెంటనే సీఎం కేసీఆర్‌తో తగినస్థలాన్ని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సింది గా కోరుతానని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో పత్తి కొనుగోలు చేసేలా సీసీఐని ఆదేశించాలని ఈ సందర్భంగా కోరారు.
మద్దతుధర కనీసం రూ.4100 వచ్చేలా చూడాలన్నారు. అధిక మొత్తంలో పత్తి పండిస్తున్న తెలంగాణలో ఆ పంట ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని గాంగ్వార్ సూచించారన్నారు. తాను దత్తత తీసుకొన్న కొలనుపాకలో పత్తిరైతులు ఎక్కువగా ఉన్నారని, జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. గన్నిబ్యాగ్‌లో పత్తి తీసుకొచ్చినా సీసీఐ కొనుగోలు చేయాలని జౌళి శాఖమంత్రి ఆదేశాలు ఇచ్చారని వివరించారు.












Click it and Unblock the Notifications