బీఆర్ఎస్ స్వార్ధ రాజకీయాలకు నిరుపేదలు అగ్నికి ఆహుతి!!
ఖమ్మం జిల్లా చీమలపాడు కారేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన ప్రమాదఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సహాయం అందించాలని బండి సంజయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన బిఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ కు తరలించాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబానికి, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద ఘటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్వార్ధ ప్రయోజనాలకు ముగ్గురు పేదలు అగ్నికి ఆహుతి అయ్యారని ఆయన ఆరోపించారు. మృతి చెందిన వారికి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో చేస్తున్న రాజకీయాలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు అండగా నిలవాలి అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications