బండి సంజయ్ నాల్గవవిడత పాదయాత్ర: 10రోజులపాటు 9అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా.. షెడ్యూల్ ఇదే!!
నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెడీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాల్గవ దశ ప్రజాసంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్‌పేటలో ముగుస్తుంది. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేశారు.

బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు
ఇప్పటికే బండి సంజయ్ మూడు విడతల పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంకోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మళ్ళీ నాల్గవ విడతలో 10 రోజుల పాటు జరిగే బండి సంజయ్ పాదయాత్రలో 115.3 కిలోమీటర్ల మేర తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు బ్రేక్ తీసుకోనున్న బండి సంజయ్, తెలంగాణ విమోచన దినోత్సవం నాడు జరగనున్న సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు సభలో పాల్గొంటారు.

పదిరోజుల పాటు 9అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా
పది రోజుల పాటు జరగనున్న నాలుగో విడత పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ సేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పర్యటిస్తారని పార్టీ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షెడ్యూల్ ను ఖరారు చేశారు.

తరుణ్ చుగ్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
అంతకుముందు తరుణ్ చుగ్ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశానికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సభ్యులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రాజకీయ కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్టుల ఆధారంగా కష్టపడి పనిచేసే నేతలకే టిక్కెట్లు ఇస్తామని తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో ఉత్తమ పనితీరు కనబరిచిన 12 మంది జిల్లాల ముఖ్యులతో సమావేశం కానున్నారని తెలిపారు.

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తతలు
ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగిన సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల విషయం తెలిసిందే. అడుగడుగున బండి సంజయ్ పాదయాత్రను అడ్డగించటానికి టిఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య అనేక సందర్భాలలో ఘర్షణ చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రను నిలుపుదల చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా, కోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్రను తిరిగి కొనసాగించారు.

వరంగల్ సభ విషయంలోనూ రచ్చ.. నాల్గవ విడత పాదయాత్ర ఎలా సాగుతుందో?
ఇక వరంగల్లో నిర్వహించాలనుకున్న మూడో విడత పాదయాత్ర ముగింపు సభకు సైతం పోలీసులు అనుమతి నిరాకరించగా, కోర్టు అనుమతితో బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభను నిర్వహించారు. మళ్లీ వెనువెంటనే నాలుగో విడత పాదయాత్రకు బండి సంజయ్ శ్రీకారం చుట్టడంతో ఈసారి పాదయాత్ర మొత్తం గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేస్తూ సాగనుండటంతో ఈ పాదయాత్రలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ, ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications