లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్తుందనే కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్
హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని పేర్కొన్న ఆయన ఈ కేసును వెంటనే రీ ఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజారులో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరుతున్నానన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం: బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణకు వెళ్లకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కవిత విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు సీఎం కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. కెసిఆర్ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి అని పేర్కొన్న బండి సంజయ్ బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అలాంటప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చటం సాధ్యమవుతుంది అంటూ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని కూల్చింది నువ్వు.. కేసీఆర్ వ్యాఖ్యలకు బండి కౌంటర్
ప్రతిపక్ష పార్టీల నుండి 37 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూల్చింది నువ్వు అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు త్వరలో నీ ప్రభుత్వాన్ని కూలుస్తారు అంటూ బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక నిర్మల్ జిల్లా కు చెందిన కంత్రీ మంత్రికి సంబంధించి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని... పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలని మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.

దొంగ దందాలు చేసే వారిని పట్టుకోవాలా వద్దా?
తెలంగాణ సీఎం కేసీఆర్ ని గద్దె దింపడం ఖాయమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. దేశంలో కేసీఆర్ మాత్రమే నీతివంతుడట అంటూ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేస్తే సంసారం... ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కెసిఆర్ బిడ్డ లిక్కర్ దందా చేసిందని, లక్ష కోట్లు పెట్టి ఢిల్లీకి పోయి లిక్కర్ దందా చేశారని, ఇక దొంగ దందాలు చేసినవారిని పట్టుకు పోవాలా వద్దా అంటూ ప్రశ్నించారు.

లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయ: బండి సంజయ్
కవితను అరెస్టు చేస్తే ... మన తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టు అని చెబుతూ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడన్నారు. క్లోజ్ చేసిన బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ ఓపెన్ చేయిస్తామని పేర్కొన్న బండి సంజయ్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. దమ్ముంటే.. డ్రగ్స్, క్యాసినో, లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలన్నారు.

తెలంగాణాలో బీజేపీ కి పట్టం కట్టండి
తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు... దోపిడీలు టిఆర్ఎస్ వాళ్ళవే అని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసాడని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ అమరవీరులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. మోడీ ఆదేశిస్తే పేదల రాజ్యం కోసం పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్న బండి సంజయ్, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కి వచ్చేఎన్నికలలో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications