గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తుండడంతో, కెసిఆర్ కు నిద్ర పట్టడం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పాదయాత్రకు తన మద్దతు తెలిపారు. తెలంగాణ మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Recommended Video

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది
గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటల ను ఓడించేదని ప్రశ్నించిన బండి సంజయ్ ఈటల పై వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ మంత్రులను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన అనంతరం నేరుగా అయోధ్యకు వెళ్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దళితులంటే కెసిఆర్ కు మొదటి నుంచి చిన్న చూపే ఉందని పేర్కొన్న బండి సంజయ్, దళిత బంధు పథకాన్ని కెసిఆర్ స్వయంగా నిలిపివేసి, ఇక ఆ నెపాన్ని బీజేపీ మీద నెట్టేస్తున్నారు అని ఆరోపించారు.

ప్రభుత్వ సర్వేలోనే ఈటలకు అనుకూలంగా 71 శాతం ప్రజలు
అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు కెసిఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన బండి సంజయ్, హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడుందని కెసిఆర్ ను నిలదీశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడని సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే వచ్చిందని పేర్కొన్న బండి సంజయ్ ప్రభుత్వం చేయించిన సర్వే లోనే ఈటలకు అనుకూలంగా 71 శాతం ప్రజలు ఉన్నారని తేలిందన్నారు.

హుజూరాబాద్ లో ఈటల గెలుపు తర్వాత కేసీఆర్ కుటుంబం సంగతి తేలుస్తాం
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల సంగతి తేలుస్తామని ధ్వజమెత్తారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అర్ధరాత్రి విదేశాలకు వెళ్లి అక్కడ డబ్బులు కూడబెడుతున్నారని వాటన్నింటిని ఎన్నికల తర్వాత బయటపెడతామని హెచ్చరించారు బండి సంజయ్. డబ్బు సంచులతో కేసీఆర్ అనుచరులు నియోజకవర్గంలో తిరుగుతున్నారని, వాళ్ళే ఈటల రాజేందర్ ను గెలిపించబోతున్నారు అంటూ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బు తీసుకుని ఈటలకు ఓటెయ్యండి
టిఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులను అర్థం చేసుకొని ప్రజలు ఓట్లు వేయాలన్నారు.టిఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఈటల రాజేందర్ కు ఓటేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.ఇక పాదయాత్రలతో, వ్యూహ ప్రతివ్యూహాలతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. త్వరలో జరగనున్న ఎన్నికలకు హుజూరాబాద్ లో నేతల పర్యటనలతో ఇప్పుడే నగారా మోగినట్టయ్యింది .












Click it and Unblock the Notifications